ప్రసన్న వదనం ధ్యాయేత్...
https://cherukuramamohan.blogspot.com/2017/08/blog-post_23.html
నేడు వినాయక చవితి. ఇది నేను చెప్పనవసరము లేదు. అందరికీ
తెలిసినదే! వినాయకుని మహిమ , ఆయన వైభవము చెప్పు యోగ్యత నాకు లేదని తెలుసు. చెప్పవలెనన్న
తపన మాత్రమే నాతో ఈ కాస్త చెప్పనిస్తూ వుంది.. శ్రద్ధతో చదవండి. వినాయకుని గూర్చి చెప్పబోతూ శుక్లాబర ధరం చెప్పకుండా మొదలు పెడితే తప్పు
చేసినానన్న భావన . అందుకే ముందు
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
ఈ శ్లోకమును వినాయక స్తుతిగా గాక వైష్ణవులు విష్వక్సేనుని స్తుతిగా భావించుతారు.
ఈ శ్లోకమునకు అర్థము కూడా అందుకు తగిన విధముగా అంటే తెల్లని వస్త్రము ధరించినవాడు,
సర్వ వ్యాపకుడు, చంద్రుని లేక కుందేలును బోలిన స్వచ్చమైన రంగు కలిగిన వాడు, నాలుగు
చేతులు గలవాడు, నగుమోము కలిగినవాడు అయిన వానికి సర్వ విఘ్నములను శాంతింప జేయమని
విష్వక్సేనుని ప్రార్థించుతారు. ఈ శ్లోకమున ఆయన పేరు ప్రత్యేకముగా ఉటంకించబడి
లేదు. కొందఱు విష్ణుం అని ఉన్నదీ కాబట్టి విష్ణు ప్రార్థనగా భావించుట కూడా కద్దు.
విష్ణువు అన్న పదమునకు అర్థము సర్వవ్యాపకుడు అని అర్థము. మనము ఏ దేవుని ఏ రూపములో
ఆరాధించినా మన మదిలోని భావము మాత్రము ఆయన సర్వ వ్యాపకుడు అనియే కదా! శివశ్చ హృదయం
విష్ణుం విష్ణోశ్చ హృదయం శివం అన్నారు ఆర్యులు. ఇక ఈ శ్లోకము మరి వినాయకునికి ఏ
విధముగా అన్వయమౌతుందో చూద్దాము. ముందు శుక్లాంబర ధరం తో బాటు చెప్పే రెండవ
శ్లోకాన్ని కూడా చెప్పుకొందాము.
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే
మొదటి శ్లోకము లోనే ఉన్న సందేహమంతా! అందులో ‘వినాయకుని పేరేదీ?’
అని. శ్లోకములో ‘ప్రసన్న వదనం’ అని ఉంది . వేదాంగమైన నిరుక్తము ‘ ప్రసన్నో గజ యూధపః’ అన్న అర్థము ‘ప్రసన్న’
అన్న మాటకు చెబుతూ వుంది. అంటే అసలు ఈ విశ్వాంతరాళములోని సమస్త మైన ఏనుగులకు ‘ప’
అంటే అధిపతి అని అర్థము. ‘గజయూధప’ అది అర్థము. మరి ఆ అధిపతి ఎవరు? గజముఖుడైన గణాధిపుడే!
అందుకే ఆయన వదనము అంటే ముఖమును మదినెంచి ప్రార్థించుచున్నాము అని అర్థము. ఆ
విధముగా ఈ శ్లోకము విఘ్నేశ్వర స్తుతి యగుచున్నది. శశివర్ణం చతుర్భుజం అన్న ఈ పాదము నుండి మనము
గణేశ పూర్వతాపరి ఉపనిషత్తులో కనిపిస్తుంది అన్న ఈ విషయమును నేను బ్ర||శ్రీ|| సామవేదం షణ్ముఖ
శర్మ గారి నుండి తెలుసుకొన్నాను.
ఇక రెండవ శ్లోకమునకు వస్తాము :
పర్వతరాజకుమారి యగు పార్వతి దేవి ముఖ కమలమునకు ఎవరైతే సూర్యుడో,
(సూర్యుడు ఉంటేనే కమలము వికసించుతుంది), ఎవరైతే ఏనుగు ముఖము కలిగియున్నాడో, అట్టి
దేవుని పగలు రాత్రి అన్న భేదము లేక కొలిచే
అనేకమయిన భక్తులలో ఒకడినైన నేను నిన్ను భజించుచున్నాను అని అర్థము. కొందఱు ఏకదంతం
అన్న మాటను గ్రహించి వినాయకునికి మహాభారత రచనా సమయమున ఒక దంతము విరిగినది కదా అని
అన్వయించుకొంటారు.
అప్పుడు ఈ శ్లోకము యొక్క ప్రాచీనతకే ఇబ్బంది కలుగుతుంది.
అందువల్ల మనము ఇప్పుడు మాట్లాడుకున్న అర్థమునే గ్రహించవలసియుంటుంది.
ఈయన విఘ్నములకు రాజు అందుకే విఘ్నేశ్వరుడంటారు. అంటే మొక్కితే
విఘ్నాలు కలిగించడు మొక్కకపోతే కలిగించుతాడు అని కాదు అర్థము. ఆయనకు మ్రొక్కి పని
మొదలు పెడితే అడ్డంకులు వుండవు అని అర్థము. అంతే గానీ మన మాదిరి పెడితే మంచి పెట్టకుంటే
చెడుపు చేసే దేవుడు కాదు ఆయన. దీనికి సంబంధించి ఒక కథ ఒక వాస్తవము వినండి.
తమిళనాడులో అట్చర పాక్కం అన్న ఒక ఊరు వుంది . బహుశ అక్షర
అన్నది వారు అట్లు పలుకుటచే ఆ వూరికి ఆ
పేరు వచ్చినదేమో! పాక్కం అన్నది ఊరు అన్న అర్థమును తెలుపుతుంది. ఇక్కడ , స్థలపురాణమునకు
సంబంధించినంత వరకు ఒక కథ చెబుతూ వుంటారు. ఇది శివ క్షేత్రము. ఈశ్వరుని పేరు
ఆచరీశ్వరుడు. బహుశా అక్షరీశ్వరుడు అన్న పేరు తమిళములో ఆవిధముగా మారియుండవచ్చు. ఇక్కడి వినాయకుని ప్రత్యేకముగా అచ్చుమురి లేక
అచ్చిరు వినాయకుడు అంటారు . త్రిపురాసుర సంహారమునకై
పోవు మహాశివుని రథము యొక్క ఇరుసు ఇక్కడ విరిగినట్లయినదట. కారణము ఆయన గణపతి
ప్రార్థన బయలుదేరునపుడు చేయక పోవుటయేనట. పరమేశ్వరుడు ఈ విషయమును గ్రహించి అచ్చిరు
వినాయకుని పూజించి బయలుదేరి త్రిపురాసురులపై విజయము సాధించినాడట.
ఇక్కడ మనము గమనించ వలసినది ఏమంటే శివుడు వినాయకుని పూజింపలేదు
కాబట్టి విఘ్నము ఏర్పడినదని కాదు. వినాయకుని పూజించితే ఇటువంటి విఘ్నములను
ఎన్నయినా దాటవచ్చునన్నది. ఇక రెండవది ఏమిటంటే పరమేశ్వరుడు భక్తులమైన మన బాగు కొరకు,
మనకు ఆపదలు రాకుండుట కొరకు వినాయకుని పూజించి పని ప్రారంభించమంటున్నాడు. ఇక
రెండవది నడిచే దేవునిగా కొనియాడబడే కంచికామకోటి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ
చంద్రశేఖర సరస్వతీ స్వామివారు, అపర శంకరులైన ఆది శంకరుల విగ్రహము తయారు చేయించి ఒక
VAN లో దానిని రామేశ్వరము పంపినారు. సరిగా ఆ VAN ఆ ఊరు వస్తూనే కదులుటకు
మొరాయించింది. వార్త గురువుగారికి చేరవేసినారు. ఆయన ఒక క్షణము మౌన ముద్ర పాటించి
వినాయకునికి 108 టెంకాయలు కొట్టి బయలుదేరమన్నాడు. వారు అట్లే చేసి బయలుదేరగా VAN
నిరాఘాటముగా రామేశ్వరము చేరినది.
అసలు వినాయకుని
ప్రస్తాపన శివ పురాణము నుండి గ్రహింపబడినదా లేక వేదమునందే నిక్షిప్తమై
యున్నదా అంటే ఈయన వైదికమైన దేవునిగా మనము తెలుసుకొనవలసి
యుంటుంది. శైవ, వైష్ణవాగమాలున్నట్లే గాణాపత్య ఆగమములు కూడా ఉన్నాయి. అవి వినాయకుని
ఆది దేవునిగా అభివర్ణించుతాయి. ఈ విషయము గమనించండి. జగత్ప్రళయము జరిగిపోయినది.
బ్రహ్మ కింకర్తవ్యతా విమూఢుడై తన ఆసనముపై సృష్టిని ప్రారంభించవలసిన విధివిధానమును
గూర్చి ఆలోచించుతూ వుండగా ఓంకారమును ఉపాసించమని ఆయనకు ఒక ఆదేశము అందినది. ఎక్కడ
నుండి అన్న ఆలోచన వదిలి ఆయన ప్రణవమును ఉపాసించనారంభించినాడు. ఒకనాడు ఆయనకు సగుణాత్మకమైన
ఒక రూపు ఆయన అంతర్ దృష్టి లో మెదలినది. ఆ స్వరూపము పైభాగము అంటే కంఠము పై భాగము
గజవదనముగానూ క్రింది భాగము నాలుగు చేతులు కలిగి అతి పెద్ద బొజ్జతో శాంత పవిత్ర
ఊహాతీత రూపమును సంతరించుకొని ఉన్నది. అ
దర్శనమే బ్రహ్మ సృష్టికి మూల కారణము.
ఇక్కడ మనము అర్థము చేసుకొనవలసిన ఒక ముఖ్యమైన విషయము ఏమిటంటే
శంకరులవారు
క్రీ.పూ. 509 – 477 అని నేను ఇంతకు మునుపు మనవి చేసియుండినాను. అప్పుడు జైన బౌద్ధములు, ఆందులోనూ
బౌద్ధము అమితముగా ప్రబలి యుండినది. ఇవి ఇట్లు ఉండగా వైదిక సాంప్రదాయములైన 1.శైవ 2.
వైష్ణవ ౩. శాక్తేయ 4. సౌర 5. గాణాపత్య 6. కాపాలము అన్న షణ్మతములు ప్రబలమై
ఒకరినొకరు చంపుకునే రీతిలో వెర్రితలలు వేసి యుండినవి. వానిని సమన్వయము చేసి ఆదిశంకరులవారు
కాపాలమును సాత్వికమొనర్చి పంచాయతన పూజను ఏర్పాటు చేసినారు. 'ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం మహేశ్వరం' అంటూ స్యూరుడు, అంబిక, విష్ణువు, గణపతి, శివుడు, ఈ ఐదు దేవతల అర్చనను
పంచయతన పూజ అన్నారు. తమ ఇష్ట దైవమును మధ్యనుంచి మిగత నలుగురిని
అధిష్టాన దేవతకు చుట్టూ ఉండునట్లు ఏర్పాటు
గావించినారు.
వారిని గూర్చి మహా
పండితులు ఏమంటున్నారో వినండి.
“His
greatness lies in the fact that he gathered up scattered cultural and spiritual
energies of the people and raised the voltage tenfold,” mentions Swami
Ranganath Ananda of Sri Ramakrishna Mission. “He revised Hinduism by
reforming the Buddhist elements in Gaudapada Kaarika and gave them a vedantic
character …which represents a turning point,” says Prof. Sengakee Mayada, an
eminent Indologist in Japan.
ఈ విషయము ఎందుకు చెప్పినానంటే
సృష్టికి మూలము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాకుండా విఘ్నేశ్వరుడు ఎక్కడనుండి
వచ్చినాడు అని మీరు అనుకొనకుండా ఉండుటకు. అంటే అసలు వినాయకుని మంత్రము
‘గణానా 2న్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ముపవశ్రవస్తమం
జేష్ఠ రాజం బ్రహ్మణాం
బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నూతిభిః సీదసాదనం
అన్న ఈ మంత్రము బుగ్వేదం
రెండవ మండలంలో (23.01)
కని పించే గణపతి స్తుతి ఇది. సర్వ వ్యాపివి నీవు. అంటే సర్వ వ్యాపకులైన
వారిలో కూడా నీవు వ్యాపించి యున్నావు. కవి అన్న శబ్దానికి ఇది కూడా ఒక అర్థము.
ఇక్కడ కవిం కవీనాం అని ఉపయోగింపబడింది. ఉపవశ్రవస్తమం అంటే వినుటకు ఉన్నతమైన అంటే
పెద్దవయిన లేక వెడల్పయిన చెవులు కలిగినవాడు, జేష్ఠులకు జ్యేష్ఠుడైన పాలకుడు బ్రహ్మతత్వము
తెలిసినవారి బ్రహ్మవు, మొరలాలింపగ నిలచిన ఆపదాపహర్తా అంటే ఆపదలు తొలగించేవాడా ఓ సకల దేవ గణములకు నాయకుడైన వాడా మా హవిస్సులను
గైకొనుము అని భక్తుని అభ్యర్ధన. ఈ మంత్రమునకు ద్రష్ట గృత్సమధుడు అన్న ఋషి. దీనిని గణపత్యధర్వ శీర్షములో
చూడవచ్చు.
సాయణభాష్యంలో
గణానాం అంటే దేవాది గణాలనీ, గణేశ అంటే వేద మంత్రాది స్తోత్రాలతో
సుత్తించే వారి నాయకుడని అర్థం.
ఈ విశేషణా
లన్నీ బుగ్వేద కాలంలో గణపతిని ఇంద్రునిగా కూడా భావించియుండవచ్చు. నేటి సినిమాలలో,
కొన్నికొన్ని కథలలో ఇంద్రుని నీతిమాలిన వానిగా చూపుట కద్దు. ఇది కేవలము
మానసిక అపరిపక్వత. యజుర్వేదములోని రుద్ర
నమకములో గణపతి రుద్రునిగా భావింపబడినాడు.
సుముఖ, ఏకదంత, గజకర్ణిక, వికట, విఘ్నరాజ, గణాధిప, ధూమకేతు, గణాధ్యక్ష, గజానన, వక్ర తుండ, కపిల, చింతామణి, డుంఠి(పద్మపురాణం), పిళ్ళారి ( ఈ
పిళ్ళారి అన్నది తమిళమునుండి గైకోనబడినది. దీనిని గూర్చి ముందుముందు
చెప్పుకొందాము.), శ్రీ
గణనాథ, కరివదన, లకుమికర (అంటే
లక్ష్మీకరుడు), అంబాసుత, సిద్ధి వినాయక
(సంగీత శాస్త్రాల్లో), ఇలాంటి అనేక పేర్లతో, వాటికి తగిన లక్షణాలతో గణేశుడు వివిధ
కాలాలలో కనిపిస్తాడు.
పంచభూతాలలో
ఆకాశానికి విష్ణువు,
వాయువుకు సూర్యుడు, అగ్నికి శక్తి (అంబ), భూమికి శివ, జలాలకు గణేశ
అధిదేవతలుగా చేసిన వర్ణనలు మనకు పురాణాలలో కనిపిస్తాయి. జలాధిదేవత కావటం వలనే గణేశ
ఉత్సవాలలో నిమజ్జనానికి ప్రాముఖ్యం వచ్చియుంటుంది. కానీ, ఇది రాను రానూ అతి
ధోరణిగా మారి చివరికి ఈ నిమజ్జనం అనేది జిప్సం, పీవోపీ, విషపు రంగులతో
జలకాలుష్యానికి దారితీసింది. మనుస్మృతిలో,
''విప్రానాం దైవతం శమ్భుః
క్షత్రియాణాం తు మాధవా
వైశ్యానాం
తు భవేద్ బ్రహ్మా శూద్రానాం గణ నాయకా” అని ఉన్నది.
దీనికి
విపరీతార్థములు కూడా మనకు వెతికితే కనబడుతాయి. వినాయకుడు శూద్రులకు దేవుడా? అని
ముక్కుపైన వ్రేలు వేసుకొనే వారిని మనము చూడవచ్చు. శాస్త్రములలో బ్రాహ్మణ నుండి
శూద్ర వరకు వచ్చే లోపల నిష్ఠ తగ్గుతూ వస్తుంది. నిష్ఠ ఎప్పుడూ జీవన విధానము, వృత్తి
తో ముడిపడి వుంటుంది. శూద్ర అన్న తెగ వృత్తి పరమైనది కాబట్టి వారికి ఈ మడి ఆచారము
అవసరము లేదు. అందువల్ల వారు శుచిగా స్త్నానము గావించి, వినాయక చవితినాడయితే తలంటు
పోసుకొని కొత్త బట్టలు ధరించి వినాయక పూజ చేసుకొనవచ్చును.
వినాయకుడు శూద్రులకు మాత్రమె దేవుడయితే మరి అన్ని వర్ణముల వారు ఎందుకు
చేస్తున్నట్లు? అన్నది మొదటి ప్రశ్న అయితే మానవులకన్నా నికృష్ఠులగు రాక్షసులు బ్రహ్మ విష్ణు
మహేశ్వరులను తప్పించి వినాయక పూజ లేక ఉపాసన మనము తెలియరాము. అందువల్ల వినాయకుని పూజించుటకు మనకు వరముల నిచ్చుటకు
సులభమైన దేవునిగా మనము పరిగణించ వలసి యుంటుంది. ఇక గణపతి ప్రస్తాపన వామాచారములో
కూడా వస్తుంది. ఆ విధానము బెడిసి కొడితే ప్రాణాంతకమౌతుంది. అందువల్ల ఆ పూజల జోలికి పోకూడదనేది ఆదిశంకరుల
మాట.
గణపతి
ఆరాధనను గాణాపత్యం అంటారని ముందే చెప్పుకొన్నాము. గాణాపత్యం ద్వారా గణపతి, వినాయక, విఘ్నేశ్వర, గజానన మూర్తులన్నీ
కలగలిపి మహా శక్తివంతమైన దేవతగా, ప్రథమ వంద్యునిగా పూజింపబడుతాడు. ఈ గాణాపత్యము
దక్షిణ దేశమున తమిళనాడు, కర్నాటక , కేరళ ప్రాంతాలలో వరుసక్రమములో విస్తరించి యున్నదని
నా ఉద్దేశ్యము. దేశములోనే ఈ ప్రథ చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతము మహారాష్ట్ర. ఈ
రాష్ట్రములో మోరేగాఁవ్ అన్న ఊరు వున్నది. ఈ క్షేత్రములో కొలువై వున్న స్వామిని
మయూరేశ్వరుడు లేక మోరేశ్ అని మరాఠీ లోనూ అంటారు. కానీ ఆ విగ్రహము ఈశ్వరునిది కాదు విఘ్నేశ్వరునిది.
ఇచ్చట ముద్గల మహర్షి తపమాచరించి విఘ్నేశ్వర సాక్షాత్కారము గావించుకొన్నాడట. అసలు ఈ
ప్రాంతము నెమలియాకారములో ఉండుటయే గాక, ఇది నెమళ్ళకు నిలయమట. ఈ భారతదేశము భగవంతుడు
జన్మించిన భూమి. ఈ భూమిపైనున్నన్ని వింతలు ప్రపంచములోని వేరు ఏ ప్రాంతములో కూడా
చూడము.
అసలు తత్త్వము లోనికి వెళితే యజుర్వేదములోని రుద్రనమకములోని
4 వ అనువాకములోని 5 వ యజున్మన్త్రము నమో గణేభ్యో గణపతిభ్యశ్చవోనమః. అని తెలుపుతుంది. దేవానుచర
గణములకు నమస్కారము. దేవానుచర గణములకు ప్రభువైన మీకు నమస్కారము. ఇది రుద్ర పరముగా
చెప్పిన మాట. కానీ ఇక్కడ మనము తెలుసుకోన వలసినది ఏమిటంటే ఏ దేవతను ఉపాసన
చేస్తున్నారో ఆదేవతకు మిగత దేవతా గుణాలు కూడా ఆపాదింప బడుతాయి. అంటే ఇది పరమాత్మ
ఒకడే అని తెలుపుతూ వుంది. భగవంతుని సృష్టి కర్తగా భావించినపుడు ఆయన పరమేశ్వరుడౌతాడు. అదే బ్రహ్మముగా
భావించినపుడు ఆయన పరమాత్మయౌతాడు. ‘ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ’ అన్నది ఉపనిషద్
వాక్యము. మాండూక్యోపనిషత్తులో మొదటి మంత్రము ఈ విధముగా చెబుతుంది.
ఓం
ఇత్యేదక్షరమిదం సర్వం
తశ్యోప
వ్యాఖ్యాయనం భూతం భవత్ భావిష్యాదితి
సర్వమోంకారమేవ
యాచంయాత్ త్రికాలా తీతం తదప్యోంకారమేవ
అసలు భూతభవిష్యద్వర్తమానములకు కూడా అతీతమైనది ఈ ఓంకారమని చెప్పబడినది. ‘ఓతస్మిన్
జగతితి ఓం’ అని ఓంకారము యొక్క నిర్వచనము. ‘ఓతము’ అంటే నేత అంటే నేయుట మన ఆంగ్లములో
WEAVING. నేయుటలో వచ్చు పడుగు పేకలను ఒతప్రోతములు అంటే అడ్డము నిలువు గల నేత ను అంటారు. ఇప్పుడు పరమాత్మ ఓంకారమని
తేలింది. మరి గణపతి ఓంకార స్వరూపుడని వేదము ఘోషిస్తూ వుంది. వేదోపాసకులు
నాదోపాసకులు అయిన ముత్తుస్వామి దీక్షితులవారు స్కందోపాసకులు. వారు వాతాపి గణపతిం భజే హం’ అన్న
హంసధ్వని రాగములో స్వరపరచిన వినాయకుని కీర్తనలో తాను స్కందోపాసకుడైనా ఆయన
ధ్యానములో వినాయకుడు ఏ విధముగా కనిపించినాడంటే ‘పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప ‘ గా ఆయన రచించిన వాతాపి గణపతిం
భజే అన్న కృతిలో మనకు కాన వస్తుంది.
ఇందులోని ఇంకొక మాట ‘మూలాధార
క్షేత్ర స్థితమ్’ ఈ రెండు విషయముల గూర్చి చెప్పుకుందాము. వాక్కు యొక్క మూలమును
కనుగొన్నది మన ఋషులు. వాక్కును నాలుగు విధములుగా విభజించినారు వారు. అవి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని నాలుగు విధములు. పర అనగా భావమునకు పుట్టుక ఏర్పడిన చోటు. ఇది భావముపుట్టక ముందు కూడా వుంటుంది. పశ్యంతి అనగా భాష లేని భావము. మధ్యమ అనగా భాషతో కూడిన భావము. వైఖరి అనగా బయటకు వ్యక్త పరచిన భావము. పైన తెలిపిన పరాది చత్వారి
వాగాత్మకం అన్న మాటకు అర్థము ఇదియే! ఇక ఈ నాలుగింటిని సమన్వయించ ప్రయత్నించుదాము.పరా ప్రత్యక్ష్తతీ రూపా పశ్యంతీ పరదేవతా
మాధ్యమా వైఖరీ రూపా వర్తమానస సంస్థితా
చైతన్యమునకు కేంద్రము బ్రహ్మ రంధ్రము. పుట్టిన పిల్లలకు నడినెత్తి మీద వత్తితే చర్మము క్రింద గుంత తెలియవస్తుంది. అదే పుణికె. దానిని బ్రహ్మరంధ్రమంటారు. అది త్వరగా పూడి పోతుంది. మనకు అంటే మానవులకు చైతన్యము అక్కడ మొదలయ్యేది. అక్కడ నుండి సుషుమ్న నాడి ద్వారా మూలాధారమునకు సంకేతము, ఒక విద్యుత్ ఘాతము కలిగినంత వేగముతో మూలాధారమునకు ఈ సంకేతము చేరుతుంది. విద్యుత్ ఘాతము అంటే ఎలక్ట్రికల్ షాక్ అని అర్థము. అక్కడి నుండి ఈ మూలాధారము రెండురెండు గ్రంధులను దాటించి పైకి పంపుతుంది. అది భావముగా పరిణమించుతుంది. దానికి తగిన భాషను దానికి వలయు పదాలను మెదడు ఎన్నుకొని కంఠము ద్వారా నోటినుండి మాటలాడింప జేస్తుంది. ఒక వేళ భాష రాని బాలుడైతేనో? మూడవ స్థితి చేరిన తరువాత మెదడు నుండి సంకేతములు తాను చెప్పదలచుకున్న భావమునకు తగు శరీరావయవములకు అందజేయుట జరుగుతుంది. అది ఒక వేళ బాధ అయితే ఏడుపు తో వ్యక్తము చేయబడుతుంది. మనము మాట్లాడేది వైఖరి. ఇది మనషికి మాత్రమె సాధ్యము. దీనిని తురీయము అని కూడా అంటారు. వేదము ఈ విధముగా చెబుతున్నది.
చత్వారి వాక్పరిమితాని వదాని
తాని విరుద్బ్రాహ్మణాయే మనీషిణః
గుహా త్రీణి నిహితానెంగయంతి
తురీయం వాచూ మనుష్యా వదంతి
భావ ప్రకటనకై వృక్షములు ‘పరా’ వాక్కును వాడుతాయట. అది మహా ఋషులకు మాత్రమె అర్థము కాగలదు. అందుకే మనము గమనించ వలసినదే గానీ చెట్టు యొక్క ఆత్మగతమును అర్థము చేసుకోలేము. పక్షులు ‘పశ్యన్తే’ వాక్కును ఉపయోగిస్తాయి. దీనిని మునిపుంగవులు యోగ్యులయిన శిష్యులకు నేర్పేవారు. ఇక పశుభాష ‘మద్యమ’ దీనిని తమ సంరక్షణలో యుండే పశువులను పరిశీలించి తెలివయినవారు తెలుసుకొనగలుగుతారు. ఇక మనము మాట్లాడేది ‘వైఖరి’. ఇప్పుడు నేను చెప్పిన ఈ విద్ విషయమును ఈ శ్లోకము నుండి గ్రహించినదే!
పరా వృక్షేషు యా వాక్సా
పశ్యన్తీ పక్షిషు స్మృతా
మాధ్యమా పశుషుః ప్రోక్తా
మనుష్యేషుచ వైఖరి
కాశీ ఖండములో ఈ వాక్కులను గూర్చి శ్రీనాధుడు ఈ విధముగా చెబుతాడు.
“శబ్ద బ్రహ్మము కారణ బింద్వాత్మకమై బిందు నిష్యందత్వమున పురుషచ్ఛాయా ప్రయత్నమున మూలాధారావస్థిత పవన సంధుక్షణనమున నభివ్యక్తమై ‘పరా’ వాక్కనబడును. ఆ బ్రహ్మము నాభిపర్యన్తము నా వాయువుచేత నభివ్యజ్యమానమై విమర్శ రూపమైన మనస్సుతో కూడి సామాన్య స్యంద ప్రకాశ రూపిణియు కార్య బిందు తత్వాత్మికయు నీశ్వరాధిదేవతయునై ‘పశ్యన్తీ’ వాక్కనబడును. ఆ బ్రహ్మ వాయువు చేతనే హృదయపర్యన్తమభివ్యజ్యమానమై నిశ్చయాత్మక బుద్ధియుక్తమై విశేష స్యంద స్వరూపయు నాదబిందుమయ హిరణ్యగార్భాది దేవతయునై మధ్యమావాక్కనబడును. ఆ బ్రహ్మమాస్య పర్యంతము నా వాయువు చేతనే కంఠాది స్తానములయందభివ్యజ్యమానమై ‘అ’కారాది ‘క్ష’కారాంత వర్ణమాలా రూపమై వైఖరీ వాక్కనబడును.”
అంటే శబ్ద ఉత్పత్తికి మూలాధారమే మూలము. ఈ మూలాధారములో ఉన్నవాడు గణేశుడు. అందుకే చదువు ప్రారంభించు సమయమున ‘శుక్లాంబర ధరం...’ తో మొదలు పెట్టె వాళ్ళము మా కాలములో.
ఇది ముత్తుస్వామి దీక్షితులవారు ప్రయోగించిన పదములకు అర్థము.
కల్ప ప్రారంభములో బ్రహ్మ సృష్టి చేయ నుంకించి, వికల మనస్కుడగుట చేత ప్రణవమును ఉపాసించినాడట. అంతర్ముఖుడైన ఆయన హృదయములో ఓంకార రూపుడగు గణపతి ప్రకటమైనాడట. అప్పుడు ఆయనను కొలిచి బ్రహ్మ సృష్టి ప్రారంభించినాడు. ఇక గణపతిని ఒక పసుపు ముద్దగా చేసి పూజించుట మనకు తెలిసిన విషయమే. పసుపు కల్యాణప్రదము. ఈ ముద్ద అన్నది సృష్టికి సంకేతము. ఏ బొమ్మను చేయవలెనన్నా తడిసిన ముద్ద కావలసిందే. అసలు తడిపితేనే ముద్ద అవుతుంది. ఇక పసుపు లో పృథివీ ఆపస్సు తేజస్సు వాయువు అన్న నాలుగు తత్వములూ వున్నాయి. ఇక కావలసింది పంచ భూతాలలోని ఆకాశ తత్వమే. పరమాత్మ తానే ఆత్మా రూపములో ఆ బొమ్మయందు ప్రవేశించుటతో మనము పంచభూతాత్మకమౌతున్నాము. కావున ఈ పసుపు ముద్ద చిన్మయ రూపుడైన ఆ వినాయకునికి ప్రతినిధిత్వము వహించుతుంది. చిన్మయము అనగా చైతన్యవంతమైనది అని అర్థము. వినాయకుని కంఠము వరకు చిత్తు, ఆ గజవదనమే సత్తు. చిత్తు అంటే చైతన్యము . సత్తు ‘పరతత్వము’. ఇక ఇంకొక విషయము .ఈ వినాయకుని గా భావించే పసుపు ముద్ద శంఖాకారములో ఉంటూ క్రింద భాగము అంటే మూలము అంటే Base స్థూలముగా వుండి మూలాధారమును తలపింప జేస్తుంది, ఇక పోనుపోను శిఖరము యొక్క అగ్రము చేరితే అన్నింటికన్నా ఎత్తున ఉండేది ఓకే ఒక అణువు. అది ఆ పరమాత్మ తత్త్వము యొక్క సూక్ష్మ రూపమును తెలుపుతుంది.’ అణోరణీయాన్ మహతో మహీయాన్
లింగపురాణం
శివుడి అంశతో గణపతి పుట్టినట్టు చెప్తుంది. మత్స్యపురాణంలో పార్వతి నలుగు బొమ్మ కథ
కనిపిస్తుంది.
మోదః అంటే
ఆనందం. తిన్నవారిని ఆనందింప చేస్తాయి కాబట్టి వీటిని మోదకాలు అన్నారు. అసలు మోదకము
అంటే మోదము అనగా సంతోషమును కలిగించునది అని అర్థము. అంటే అది తినుటవల్ల మోదము
కలుగుతుంది ఎందుకంటే దాని లోన పూర్ణము ఉంటుంది కదా! అది ఒక అర్థమైతే ఆయన మోదఫలమును (అంటే ఫలితమును
) ఎల్లవేళలా చేత పట్టుకొని యుంటాడు. మనము
ధ్యానించుటయే తరువాయి . నారాయణోపనిషత్తు 'తత్పురుషాయ
విద్మహే/వక్రతుండాయ ధీమహి/తన్నో దంతిః ప్రచోదయాత్' అనే మంత్రం చెప్పుచుంది.
పురుషుడు అన్న పేరు ఆదిదేవుని సూచిస్తుంది. అంటే వినాయకుని ఆ పురుషుడు నావే అంటూ
వున్నది. ఇది మనము ఏ దేవతను ఉపాసించితే ఆ దేవత పేరును చేర్చి చెబుతాము. ఉదాహరణకు
శివుని గూర్చి చెప్పవలసినపుడు ‘తత్ పురుషాయ విద్మహే మహా దేవాయ ధీమహి తన్నో రుద్రః
ప్రచోదయాత్’ అని చెప్పుకుంటాము. మనము ఏ పేరుతో సేవించితే ఆ రూపములో
సాక్షాత్కరిస్తాడు. మరి ఏ రూపమైనా అన్నపుడు వినాయకుడే ఎందుకు? ఆయా దేవతా మంత్రములు
కొన్ని సద్యోఫలితదాయకములై ఉంటాయి. అంటే తక్షణ లేక శీఘ్ర ఫలితములను ఇచ్చేవిగా
వుంటాయి. కొన్ని ఉచ్చరించుతూ వుంటే ఒక అనిర్వచనీయ ఆనందము, ఒక తన్మయత కలుగుతాయి.
వినాయకుడు
ప్రణవస్వరూపుడు అనుటకు అవ్వయ్యార్ వ్రాసిన తమిళ గ్రంథము ‘వినాయగ అహవల్’ చదివితే
తెలుస్తుంది. ఇందులో ఆ మహా భక్తురాలు వినాయకుడు ప్రణవస్వరూపి యని సోపపత్తికముగా
చెబుతుంది. ఆ ప్రణవస్వరూపుని భ్రూమధ్యమున నిల్పి అచంచల నిష్ఠతో వ్రాసిన అపురూప
గ్రంధమే ఈ
‘వినాయగ
అహవల్’. ఇది ఒక యోగ శాస్త్ర గ్రంధము. ఇందులో ధ్యానము చేయు విధానము, కుండలినీ
శక్తిని సహస్రారమునకు చేర్చు పద్ధతి మొదలగు అత్యంత నిశితమైన విషయ చర్చల గూర్చి
మనము తెలుసుకొనగలము. ఈ మహా భక్తురాలు చేర రాజుల కాలములో అంటే క్రీ.శ. 8 – 14 శతాబ్దముల
మధ్య కాలములో వుండినది. ఈమె జన్మస్థలము సేలం అని చెబుతారు. చుట్టూ కొండలు గలిగిన ఈ
ప్రదేశము శైలము అన్న పేరును కలిగియుండి సేలం అన్న పేరునకు రూపాంతరము చెందినది.
ఒకసారి
చేర రాజు మరియు నాయన్మారులలో ఒకరైన సుందరమూర్తి ఏనుగును గుర్రమును ఎక్కి వెళుతూ
అవ్వయ్యారును గూడా తమతో రమ్మన్నారట. ఆమె మీరు వెళ్ళండి నాకు కైలాసమునకన్నా
కరివదనుడే ముఖ్యము అనిందట. వల్లెయని వారు తమ దారిన తాము పోసాగినారు. పూజ ముగించిన
పిదప వారు కైలాసము వెళ్లినారే మరి నేను చేరేదెట్ల అని మనసులో తలంచినదట. ఆ మహా
భక్తురాలు తలచినదే తడవుగా గజముఖుడు ఆమెను తన తొండముతోనెత్తి కైలాసములో దింపినాడట.
రాజు సుందరమూర్తి కైలాసము చేరి చూస్తే అవ్వయ్యార్
కనిపించింది. వారు ఆమె అచంచల భక్తికి అబ్బురపడి ముందు ఆమెకు సాష్టాంగ
దండప్రణామమునాచరించి భక్తియందు తమ అపరిపక్వతకు నొచ్చుకున్నారట.
వినాయకుని
గూర్చి గొప్పవారగు ప్రవచన కారులు సప్తాహము, నవరాత్రులు అని వరుసగా చెప్పుకొంటూ
పోయినారు. ఆ విఘ్న నాయకుని గూర్చి చెప్పుట సముద్రము నుండి ఒక చెంబు నీళ్ళు తెచ్చుట
వంటిది. ఒక వేళ ఎవరైనా చెంబులో ఏమున్నాయి అంటే సముద్ర జలము అంటాము. కానీ
సముద్రములోని నీరు అంతా అందులో వున్నదా? గణపతి తత్వమును గూర్చి చెప్పుట కూడా అంతే!
గణపతి పై
అమితమైన విధేయతతో ఈ పర్వదినము నాడు ఆ ఓంకార రూపుని ఆ ప్రసన్న వదనుని గూర్చి చెప్పే
అదృష్టము నాకు మయిండ్ మీడియా ద్వారా లభించినది. వారికి కృతజ్ఞతలు చెప్పుకొంటూ ఈ
నాటికి నా ప్రసంగమును ముగిస్తున్నాను.
స్వస్తి.