Wednesday, 25 May 2016

ఆనో భద్రాః క్రతవో




ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతో S దబ్ధాసో అపరీతాస ఉద్భిదఃl

దేవానో యథా సదమిద్ వృద్ధే ఆసన్న ప్రాయువో రక్షితారో దివే-దివేll




आ नो भद्राः क्रतवो यन्तु विश्वतोऽदब्धासो अपरीतास उद्भिदः ।
 देवा नो यथा सदमिद् वृधे असन्नप्रायुवो रक्षितारो दिवे-दिवे ॥ 

Tuesday, 3 May 2016

హిందూ మతము - మూర్తిపూజ మరియు విద్య-అవిద్య


హిందూ మతము - మూర్తిపూజ
(కీర్తి శేషులు Dr. VVS శర్మ గారి రచన)
ఇస్లాం, క్రైస్తవ మతాలు భారతదేశంలోనికి వచ్చాక వారికి విపరీతముగా కనుపడినది మన మూర్తి పూజ. మహమ్మదు ప్రవక్త సా.శ. 610లో తనకు దేవుడైన అల్లా నుండి సందేశమువచ్చినదని, ఆయన ఒకడే దేవుడనీ, తాను దేవుని ఆఖరు ప్రవక్తననీ ప్రకటించాడు. అంతకు ముందు అరేబియాలో అనేక దేవతలకు మూర్తిపూజ జరుగుతూ ఉండేది. మహమ్మదు మొదట మక్కాలోనూ, తరువాత తూర్పు అరేబియాలోనూ గల అనేక దేవతా విగ్రహాలను ధ్వంసంచేయించాడు. తరువాత కాలంలో మనదేశంపై తురుష్కుల , మంగోలుల, అరబ్బుల దండయాత్రలు జరిగినపుడు, వారిదృష్టి మనమీద పడినప్పుడు, వారికి ప్రత్యేకంగా కనపడినవి మనదేవాలయాలు. మనము అసత్యమైన దేవతాపూజలు చేస్తున్నామని మనమతం మార్చి, మన విగ్రహాలను పగులగొట్టి మనకు, స్వర్గంలో ఉండే కనబడని, సత్యమైన దేవుడైన అల్లానో, యెహోవానో యజమానిగానో, కాపరిగానో చేయాలనీ ఆనాటినుండి ఈ నాటి వరకు వారిలోకొందరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ఆలయ విధ్వంస కార్యక్రమం సా. శ.1000 నుండి 1700 వరకు మహమ్మదీయ పాలనలోనూ, 1500 నుండి 1700 వరకు పోర్చుగీసు, ఫ్రెంచ్ క్రైస్తవులచేత కూడా గోవా, పుదుచ్చేరి ప్రాంతాలలో కొనసాగింపబడినది. తరువాత క్రైస్తవ ప్రచారకుల ప్రణాళికలు మారాయి. ఈ మధ్య "మతాంతర దేవాలయము", "ఆరోగ్యమాత దేవాలయము" అనే చర్చి పేర్లూ, "శ్రీ క్రీస్త ఏసవే నమః" అని మంత్రాలు, “సత్యవేదసంస్థ” వంటి అనువాదాలు కనబడుతున్నాయి. ఒక విధమైన శుభపరిణామమేమో?
వేదాలలో దేవాలయాల, మూర్తిపూజల ప్రసక్తి లేదు. అక్కడ దేవతా స్వరూపమూ మంత్రమే. మంత్రాలలో కొన్ని మంత్రగణాల అధిపతియే "గణానాంత్వా.." అనే ఋగ్వేదమంత్రములో వర్ణింపబడిన మహాగణపతి. వేదకర్మలైన యజ్ఞాలలో దేవతలను ఎలా పూజిస్తారు? అగ్నిలో వేసే ఆహూతులవలన. స్వాహాకారంతో "ఇంద్రాయ స్వాహా ఇంద్రాయ ఇదం నమః" అని ఆజ్యంతో అగ్నికి సమర్పించడమే ఇంద్రపూజ. ఈ యజ్ఞ కర్మలు సమాజములో అందరకు విధింపబడలేదు. కాలక్రమంలో దేవతార్చన, పూజలను సమాజం అందరిదగ్గరకు తీసుకువెళ్లినదే మూర్తి పూజ. ఆలయ నిర్మాణానికి, దేవతా విగ్రహాల తయారీకీ ఆధారం ఆగమాలు. ఇవికూడా చాలా ప్రాచీనమైనవి. వైష్ణవంలో వైఖానస, పాంచరాత్ర ఆగమాలు సుప్రసిద్ధం. అలాగే శైవంలో శైవ సిద్ధాంత, పాశుపత, కాలాముఖ, కాశ్మీర శైవ ఆగమాలు ఉన్నాయి. శాక్తేయులకు, గాణాపత్యానికి, కౌమారానికి కూడా ఆయా ఆగమాలు ఉన్నాయి. రుద్ర హోమంలో "నమః సోమాయ చ రుద్రాయ చ. స్వాహా" అంటూ రుద్రమంత్రంతో స్వాహాకారంచేస్తే, అదే మంత్రంతో స్వాహా కారంలేకుండా జలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఈ యజ్ఞం, ఈ అభిషేకం అందరూ దర్శిస్తారు. ఫలం అందరిదీ, యజ్ఞ కుండం నిర్మించిన వారికీ, స్రుక్, స్రువాలను చేసిన వడ్రంగులకి, మట్టిపాత్రలు చేసిన కుమ్మరులకు, సమాజంలో అందరికి. "ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్.." అని శివుని ధ్యానిస్తూ చిన్న పార్థివ లింగానికీ లేదా స్పటిక లింగానికీ, ప్రక్కనే ఉన్న సాలగ్రామానికో ఇతర దేవతా విగ్రహాలతో కలిపి అభిషేకం చేస్తారు. ఈ పంచాయతన పూజ శంకరాచార్యుల కాలంనుంచీ వస్తున్నదే. మూర్తి పూజ ఆలయంలోనైనా, ఇంటిలోనైనా, యోగ సాధనలో మూలధారములోని గణపతికైనా హిందువులకు సుపరిచితమే. దీని ప్రభావమే ఇళ్ళలో విగ్రహాలు, చిత్రపటాలతో పూజ గదులు గా, పూజా స్థలాలుగా పరిణామంచెందినది. ప్రతిహిందువుకు ఇంటిలో శాంతినీ తృప్తినీ ఇచ్చేస్థలం ఇది. ఇది కర్మలపై ఆధార పడిన వేదమతం, ధ్యాన సాధనాదులతో కూడిన జ్ఞాన మార్గములు కాక అందరికీ అర్థమయే, అందుబాటులో ఉండే తీరులోని, భక్తి సంప్రదాయ మార్గం.
21 వ శతాబ్దంలో జిహాద్, క్రూసేడ్ information warfare గా కూడా పరిణామం చెందాయి. విగ్రహారాథనకు విరుద్ధంగా వచ్చే ప్రచారం Blogs, Facebook Statuses and Comments గా వస్తూంది. ఒక ఉదాహరణ - ఇది యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషన్మంత్రం.
అంధం తమః ప్రవిశంతి యేఽసంభూతిముపాసతే ।
తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాఁ రతాః ||
దీనికి అన్యమతస్థులు చెప్పే అర్థంఇది - పరమాత్మను విడిచి కంటికి కనపడే సృష్టి పదార్థములను పూజించువారు ఘోరనరకమున పడుదురు. - అందుచేత “ మీవేదం స్పష్టంగా చెప్పిన విషయాన్నే మీరు నమ్మటంలేదు మూర్తిపూజలు చేస్తున్నారు” అని వారి అవహేళన.
నిజానికి ఏమాత్రం సంస్కృత పరిజ్ఞానం ఉన్నవారైనా ఆ అనువాదాన్ని వక్రభాష్యమనీ గ్రహిస్తారు. అక్కడ ఉన్న శబ్దం అంధం. అంటే అంధకారం, చీకటి, తమస్సు, అజ్ఞానం. ఇక్కడ నరకం ప్రసక్తి లేనేలేదు. ఒక నగకో, ఒక రూపాయ నోటుకో పూజ చేస్తే పాపం రాదు. భగవంతుని పూజించిన ఫలం రాదు అంతే. అంటే విగ్రహంలో ఉన్న ప్రకృతిలోని వస్తువుకి, విగ్రహంచేసిన మట్టికి, బంగారానికి కాదు పూజ చేస్తున్నది. అలాగే విగ్రహంచెక్కిన శిల్పికి, లేదా కులాలునికి కాదు. (material and instrument causes) పూజ చేస్తున్నది దానిలోకి ఆవాహన లేదా ప్రాణప్రతిష్ఠ చేయబడిన భగవంతునికే. సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి అంటే ఏదేవతకు పూజచేసినా అది నీహృదయంలోనున్న పరమేశ్వరునికే చెందుతుంది. మొదటిపాదానికి బాహ్యార్థం ఇది - ప్రకృతిని ఉపాసించేవారు గాఢాంధకారంలో ప్రవేశిస్తారు. మూర్తి లేదా ప్రతీకపూజ చేసేవారుకూడా ఆవాహన చేయబడ్డ భగవంతుణ్ణే ఆరాధిస్తారు కాని మాయా స్వరూపమైన ప్రకృతిని కాదు (మట్టినో, లోహాన్నోకాదు.)
వేదంలో సంహితాభాగం చెప్పేది కర్మ మార్గం. ఉపనిషత్తుచెప్పేది జ్ఞానమార్గం. మూర్తిపూజది ప్రధానంగా భక్తిమార్గం. ఈ వేర్వేరు మార్గాలని సర్వోపనిషత్సారముగా భగవద్గీతలో సమన్వయంచేసినవాడు శ్రీకృష్ణుడు.
(పై వ్యాసము శ్రీయుతులు VVS శర్మ గారు నిన్న అనగా మే 3వ తేదీ 2016 న ఆస్యగ్రంధి యందు ప్రచురింపబడినది.)
ఆ వ్యాసమునకు కొనసాగింపుగా, అదేరోజున  నేను వ్రాసిన ‘విద్య-అవిద్య’ చదివేది.
దానిని మీరు రేపు చదువగలరు......
విద్య-అవిద్య
దేశమును అటు క్రైస్తవము లోనికి ఇటు ఇస్లాములోనికి దేశమును పరివర్తన చేయుటకు ఎవరిదైన రీతిలో వారు అవిరళ కృషి చేయుచుండగా మనకెందుకులే అని సనాతన ధర్మావలంబులమైన మనము చేతులు కట్టుకొని కూర్చును సమయము కాదు. నా కన్నా( నా వయసు70సంవత్సరములైనా  వారు నా కన్నా పెద్దవారు)  అన్నివిధాలా, అన్నివిషయాలలో పెద్ద వారయిన  VVS శర్మ గారు వ్రాసిన వ్యాసమునకు అనుబంధముగా నాకు తోచిన నాలుగు మాటలు వ్రాయుచున్నాను.
అంధం తమః ప్రవిశన్తి యే అవిద్యాం ఉపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయా రతాః’ 
(ఈశావాస్య 9 వ మంత్రము)
ఏ =  ఎవరైతే
అవిద్యాం = అవిద్యను
ఉపాసతే = ఉపాసించుతారో అంటే అవిద్యనే తమ ధ్యేయము లక్ష్యము గమ్యముగా చేసుకొని  అనుష్ఠించుతారో (వారు)
అంధం= మూఢత్వము లేక గాఢమైన అజ్ఞానము (అనబడు)
తమః = చీకటి (ని)
ప్రవిశంతి = ప్రవేశింతురు
విద్యాయా =విద్య యందు
రతాః =  ఆకర్షణ కలిగిన
తే = వారు
ఉ = కూడా
తతః = దానికంటే
భూయః = అమితముగా , మిక్కిలి మిక్కుటమైన
తమః = చీకటి యందే ప్రవేశింతురు
అన్య దేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా
ఇతి శుశ్రుమధీరాణాం యేనస్తద్విచక్షరే  ( ఈశావాస్య 10 వ మంత్రము)
విద్యయా = విద్య వలన
నిశ్చయా = నిశ్చయముగా
అన్యత్ = వేరువిధమైన (ఫలితమును) (అంటే ఒక విధమైన ఫలితమును )
అవిద్యయా = అవిద్యచేత
అన్యత్ = వేరువిధమైన (ఫలితమును ) (అంటే మరో విధమైన ఫలితమును ) (పొందుదురు)
ఇతి = అని
ఏనః = ఎవరైతే మనకు
విచక్షిరే = చెప్పియుండిరో (అట్టి)
ధీరాణాం = పండితుల (నుండి) 
శుశ్రుమ = నేను వినుచున్నాను.
విద్యాంచావిద్యాంచ యస్తద్వేదో భయగుమ్ సహl
అవిద్యయా మృత్యుంతీర్వా విద్యాయామమృతమశ్నుతేll 
(ఈశావాస్య 11 వ మంత్రము)
యః = ఎవరైతే
విద్యాంచ = విద్య(మరియు)
(ఆత్మ జ్ఞానము బ్రహ్మ తత్వము తెలుపునట్టిదే విద్య మిగిలినదంతా అవిద్య అంటే మనము పాఠశాలలో చదివే పాఠ్యాంశాలు, వృత్తి విద్యలు, అనేక లోకిక అంశాలు మొదలగునవి అవిద్యలే! )
అవిద్యాంచ = అవిద్యలన్న
తత్ = ఆ
ఉభయగుం = రెండింటినీ
సహా = కలిపి
వేదో =  తెలుసుకొనునో (అతను)
అవిద్యయా = (తన) దైనిక కర్మానుష్ఠానములచేత
మృత్యుం = మృత్యువును
తీర్వా = అధిగమించును లేక దాటును
విద్యాయాం = (పైన తెలుపబడిన) విద్య వలన
అమృతం = అమరత్వమును
అశ్నుతే = పొందును
అంధం తమః ప్రవిశంతి ఏsసంభూతిముపాసతే   ( ఈశావాస్య 12 వ మంత్రము)
తతో భూయ ఇవతే తమో య ఉ సంభూత్యాం రతాః
ఏ = (కానీ) ఎవరైతే
అసంభూతిం= కేవలము కర్మ ఫలముల నొసగే దేవతలను
ఉపాసతే = ఉపాసించుతారో అంటే అవిద్యనే తమ ధ్యేయము లక్ష్యము గమ్యముగా చేసుకొని అనుష్ఠించుతారో (వారు)                                                                                అంధం= మూఢత్వము లేక గాఢమైన అజ్ఞానము (అనబడు)
తమః = చీకటి (ని)
ప్రవిశంతి = ప్రవేశింతురు
సంభూత్యాం = పరబ్రహ్మపై
రతాః =  ఆకర్షణ కలిగిన ( ఆకర్షణ మాత్రమె, అందుకునే ఆలోచన చేయక ఆడంబరమును ప్రదర్శిస్తారో)
తే = వారు
ఉ = కూడా
తతః = దానికంటే
భూయః = అమితముగా , మిక్కిలి మిక్కుటమైన
తమః = చీకటి యందే ప్రవేశింతురు
అన్య దేవాహుః సంభవాత్ అన్యదాహురసంభవాత్
ఇతి శుశ్రుమ ధీరాణాం ఏనస్తద్విచక్షిరే    ( ఈశావాస్య 13 వ మంత్రము)
యః = ఎవరైతే
సంభవాత్ = కారణ కారణుడైన పరబ్రహ్మను అనుష్ఠించుటవల్ల
నిశ్చయా = నిశ్చయముగా
అన్యత్ = వేరువిధమైన (ఫలితమును) (అంటే ఒక విధమైన ఫలితమును )
అసంభవాత్ = కేవలము కర్మ ఫలముల నొసగే దేవతలను పూజింతురో
అన్యత్ = వేరువిధమైన (ఫలితమును ) (అంటే మరో విధమైన ఫలితమును ) (పొందుదురు)
ఇతి = అని
ఏనః = ఎవరైతే మనకు
విచక్షిరే = చెప్పియుండిరో (అట్టి)
ధీరాణాం = పండితుల (నుండి) 
శుశ్రుమ = నేను వినుచున్నాను.
విద్య అంటే బ్రహ్మవిద్య లేక ఆత్మవిద్య; అవిద్య అంటే ప్రాపంచిక విద్యలు, కళలు మరియు వివిధములగు శాస్త్రములు మొదలయినవన్నీ. నేర్వనైతే రెండూ నేర్చుకోవలసినదే! కానీ ఏకాగ్రత తో చిత్త నైర్మల్యముతో వానిని అనుష్ఠించుట వేరు. అది విద్యే గానీ అవిద్యయే గానీ ఆడంబరమునకు తావివ్వరాదు. అవి అటువంటి వ్యక్తిని నిబిడాంధకారము లోనికి నెట్టునవి మాత్రమె! అంటే ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎవరైతే ఊరికే పనులు చేసుకుంటూ ఉంటారో వారు బాధలకు గురి అవుతారు. అలాగే అర్హత లేకుండా డాంబికం కోసం అంటే లోకం దృష్టిలో పడడం కోసం,లోకం తనను పొగడడం కోసం ఎవరైతే ధ్యానము, భక్తి మొదలగు వాటి కోసం ప్రయత్నిస్తారో(అంటే చిత్తశుద్ధితో కాకుండా) వారు ఇంకా ఎక్కువ బాధలు పడతారు అని అర్థం. భగవంతుడు సముద్రమైతే ఇటువంటి వ్యక్తులందరూ కేవలము లొత్త గవ్వలు. లొత్త గవ్వలు తీరము చేరేవే! సముద్రముతో, సముద్రములో నిలిచిపోవు. అందుకే విద్య అవిద్యలు రెండూ నేర్చుకొమ్మని చెబుతూ వుంది వేదము ఉపనిషత్తు ద్వారా! అవిద్య ద్వారా మృత్యువును అధిగమించి విద్యతో మోక్షమును  సాధించమని నిస్సందేహమైన రీతిలో తెలుపుతూ వుంది.
ఇంతే కాకుండా ఇంకొక విషయమును మనకు ఎరుక పరచుచున్నది. ఫలితమును కోరుతూ చేసే పూజాదికములు చేసినా, మనోకామనలను పూర్తి చేసుకొనుటకు తత్సంబంధమైన ఇంద్ర, మిత్ర, వరుణాది వివిధ దేవతలను కొలిచినా అవి యన్నీ అవిద్యా చోదితములే! ఒక్క విద్య మాత్రమే పరబ్రహ్మ సాక్షాత్కారమును పొందజేసేది. ఇది ఒకసారి గమనించండి

హిరణ్యాక్ష  హిరణ్యకశిపు  ప్రహ్లాదుల కథ మనకు తెలిసినదే! ఇందు హిరణ్యాక్షుడు అన్న పదమును తీసుకుంటే, హిరణ్యము అన్న మాటకు లోకము అన్న అర్థము తీసుకొన వచ్చును. హిరణ్యగర్భుడు అంటే, లోకములను గర్భమున దాల్చినవాడు, బ్రహ్మ అనే కదా అర్థము. ఇక్కడ బంగారు అన్న అర్థము అన్వయించదు. అతను భూలోకమును చాప చుట్టగా చుట్టి సముద్రములో కలుప బోయినాడు అన్న కథను మనము విన్నాము వింటూనే ఉన్నాము. అసలు అతను ఏమి చేసినాడంటే ఈ భూగోళము యొక్క అక్షమును  అంటే ఇరుసు, కన్ను అన్న అర్థము కాదు, మార్చ దలచు కొన్నాడు. అంటే భూమి గతిని మార్చ దలచినాడు తానూ గడించిన అవిద్య చేత, అందుకే పరమాత్మునిచే పతనమై పోయినాడు. అదే విధముగా హిరణ్యము అనగా లోక నాథుడై, కశిపు అనగా శయ్య అనగా హంసతూలికా తల్పమును గలిగి , అంటే అమరిన అద్వితీయ సౌఖ్యములతో ఆ పరమాత్మనే ఎదిరించి  తా నమరునిగా నిరూపించా దలచినాడు. కానీ తానూ గడించిన వన్నీ అవిద్యలే అని  తెలుసుకోలేక అసువులు బాసినాడు ఆ పరంధాముని చేతిలో. కావున తమతమ వరములతో

వారు మృత్యువును దాటినామని అహంకరించి అదియే అమరత్వమని భ్రమించి అసువుల బాసినారు. దీనివల్ల మనకు అవిద్య వేరు విద్య వేరు అని తెలియవస్తూ వున్నది. కావున మనకు దీనిని బట్టి వేదములో సృష్టి స్థితి లయములు బ్రహ్మ విష్ణు రుద్రాదులు, విద్య అవిద్య, బ్రహ్మజ్ఞానము, స్వర్గ లోకము వరకే పరిమితమై కామ్యార్థములకై  మానవులచే వివిధ విధములుగా అంటే జప తప యజ్ఞ యాగాదులతో ప్రార్థింపబడు దేవతలు మొదలగు విషయములను మాత్రమే తెలుపబడినది కానీ విగ్రహారాధనను గూర్చి కాదు.

ఇప్పుడు పైన తెలిపిన మంత్రములలో ( ఈశావాస్యోపనిషత్తు 12 వ మంత్రము ;యజుర్వేదములో 40.9 వ మంత్రము) ఒకదాని మొదటి పాదమును తీసుకుని దానికి వక్రభాష్యము చెప్పినారు సనాతన ధర్మమూ పై సదా నిప్పులు గ్రక్కే కొంకణ దేశస్థుడైన మహమ్మదీయ మతస్థుడగు డాక్టర్ జకీర్ నాయక్  గారు మరియు వారి అనుయాయులు.
పైన తెలిపిన ‘అంధం తమః ప్రవిశన్తి యే అవిద్యాం ఉపాసతే’ అన్న ఈ శ్లోక పాదము పాఠకుల కొరకు, కేవలము ఒక ఉదాహరణగా తీసుకొనబడినది. మన ధర్మమును, తన యొక్క వ్యర్థ, అనర్థానువాదములతో  అపహసించుటే తమ ధ్యేయముగా పెట్టుకున్న వారు పై పాదమునకు విపరీతార్థమును ఈ విధముగా తెలుపుతారు :
పంచభూతములైన పృథివ్యాపస్తేజోవాయురాకాశములను కొలుచువారు చీకటిలోనికి చేరగా, వివిధ విగ్రహారాధకులు ఘోరాంధకార భూయిష్టమౌ నరకకూపనకు పోవుదురని మీ వేదమే చెప్పుచున్నదని ఎద్దేవా చేస్తారు. అసలు పాత్రోచితముగా మాట్లాడ శిక్షణ పొందిన  తన అనుచర గణముతో సమావేశముల నేర్పాటు చేసి ఇటువంటి ఘాతుక వక్ర భాష్యములు చేస్తూ వుంటారని వినికిడి. అసలు పై శ్లోకములలోనే కాదు వేదములలోనే విగ్రహారాధనను గూర్చి వినిపించదు.

ఇందులో ‘ఉపాసతే’ ‘రతః’ అన్న పదముల పైనే  శ్లోకము యొక్క అర్థము ఆధారపడి యుంటుంది. ఆతను ధనమును ఉపాసించుచున్నాడు  అంటే అతని దృష్టి కేవలము ధనార్జన పైనే ఉన్నది అని అర్థము తప్పించితే అన్యథా కాదు. పైన ‘అసంభూతి’ అన్న వస్తువు తో కలిసి నందువల్ల ఇది సకర్మక క్రియ అయినది అకర్మక క్రియ కాదు.  ఇక ‘రతః’ అన్నది సకర్మక క్రియగానే వుంటుంది. ఇది అకర్మకము కాదు.
ఇంతటి దారుణమునకు వడి గట్టు ఇటువంటి వ్యక్తులను ఎదిరించేటందుకైనా యువత శ్రద్ధతో ఇటువంటి వాస్తవములను గ్రహించి సనాతన ధర్మ విరోధులైన వారిని సమర్థవంతముగా త్రిప్పికొట్టవలెనని మా వంటి  వృద్ధుల ఉద్దేశ్యము.
స్వస్తి.
Raj Marrivada For your effort...Sata Koti vandanamulu. Ikkada (US) lo vunna vallamu, ee avidya nundi twaraga bayatapadi Bharat vastaamu...maa responsibilities nirvahistaamu! Thank you!

Gowri Shankar Very good explanation for Eesavasopanishad mantras. Sreyan svadharmo vigunah, paradharmat svanusthitat.svadharme nidhanam sreyah paradharmo bhayavahah.Thank you very much sir. You are Genius and Genltle. You are encyclopedia and a dictionary for us. Namaste.

Cheruku Ramamohanrao నేను పయోధిలో పరమాణువును గౌరీ శంకర్ గారు

Subramanyam Juturu Good evening Rao sir, being a bank manager now retired how you are so conversant with Sanskrit, Telugu and English and may be Hindi also? I am sincerely following your deep knowledge in many fields through this platform. Have you learnt Sanskrit from your forefathers in childhood? Any how I am learning many new lessons from your essays. Thank you Rao garu.

Cheruku Ramamohanrao I din't learn anything specifically. It is all God's grace. One thing is true. My friends, I don't know whether I can call them as friends, who are far elder to me made me learn so many things. Sri Rama Murthy garu the then principal SRK Jr. COLLEGE Kadapa, though not a teacher in the academics, was one such person. He loved me no less than his son. I learnt a lot from him about the World. I thank you for your affection.


Subramanyam Juturu Good morning Rao sir. Anyway you are a valuable asset for all the F/B FRIENDS.