Thursday, 17 July 2014

ఇది నిజము

ఇది నిజము

నీతి చెప్పే అర్హత నాకు వుందో లేదో తెలియదు,అందువల్ల నేను చెప్పే ఈ మాట మీరు గమనించి ఆచరించమని చెప్పుటలేదు .
కానీ నిజము మాత్రము చెప్పవద్దని ఎవరూ అనరు కదా. కావున నేను చెప్పే ఈ క్రింది మాట నిజమనిపిస్తే మీరూ నలుగురితో పంచుకొండి .
ఇది నిజము
సూర్య చంద్ర గతుల నీవు సూక్ష్మ మరయ వలదులే
భూమి ఇరుసు మార్చుపనికి పూనుకొనగ వలదులే
తిన్న తిండి వంట బట్టు తీరు తెలియ వలదులే
మనిషి మనిషి పుట్టుకలో మార్పులెరుగ వలదులే
చేతనున్న చిన్నపనిని చేయగలుగ చాలులే
ఈర్ష్యాసూయలు మానుము ఇచ్చువాడు పరమాత్ముడు
ఎవరికెంత ఇవ్వవలెనొ ఇచ్చునతడు లోటులేక
ఆనందమునభిలషించు ఐశ్వర్యము తలపోయకు
కోపమెపుడు కోరబోకు కోరికలను పెంచబోకు
నీలిగగనమై నిరతము నిశ్చలముగ నిలిచినచో
ఉరుములైన మెరుపులైన ఉండబోవు అనవరతము
ఈనిజమును గమనించుము ఈశుని మది తలంచుము
నీకుసుఖము కలుగు మరియు నీదు ఇరుగు పొరుగునకు
నీదు సంఘమునకు మరియు నీ రాష్ట్రము దేశమునకు
నిత్య శుభము నిత్య జయము నిక్కముగా కల్గు నిజము
LikeLike ·  ·